Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసిన బీజేపీ - మాస్టర్ ప్లాన్ వెనుక ఆర్ఎస్ఎస్? (video)

Advertiesment
పవన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసిన బీజేపీ - మాస్టర్ ప్లాన్ వెనుక ఆర్ఎస్ఎస్? (video)
, మంగళవారం, 15 జూన్ 2021 (16:19 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులు మరింతబలపడేవిధంగా పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే తెలంగాణాలో ఆ పార్టీ సత్తా చూపుతోంది. అధికార తెరాసకు చెమటలు పోయిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గట్టిగా నిలదొక్కుకోవాలని భావిస్తోంది. 
 
ఇందులోభాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను దగ్గరకు చేరదీసింది. మంచి జనాకర్షణతో పాటు.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ కళ్యాణ్‌‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా బీజేపీ - ఆర్ఎస్ఎస్ ప్లాన్ వ్యూహాన్ని రచించినట్టు సమాచారం.
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలపడాలని కాషాయం దండు భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల తిరుపతి ఉ‌‌పఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. 
 
తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండగా... ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి ఒక్కరూ కూడా లేరు. దీంతో ఆ లోటును భర్తీ చేసి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
పైగా, ఏపీ నుంచి బీజేపీకి ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా లేరు. సురేష్ ప్రభు బీజేపీ తరపు రాజ్యసభను ఎన్నిక కాగా.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, తిరుపతి ఉప‌ఎన్నిక సమయంలో జనసేన పోటీ విరమించుకుని బీజేపీకి అండగా నిలిచింది. దీనిపై జనసేన కేడర్‌లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్‌ కళ్యాణ్‌‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అలా చేయడం వల్ల ఇరు పార్టీల నేతలతో పాటు.. ఇటు ఏపీ ప్రజలను కూడా శాంతపరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఏపీ ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత పోతుందని భావిస్తున్నారు. తద్వారా బీజేపీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. 
 
ఏపీలో జగన్‌ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందుకే పవన్‌కు కేంద్ర మంత్రి ఇవ్వటం అవసరమని ఆర్ఎస్ఎస్‌లో కీలకంగా వ్యవహరించే ఓ ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
 
దీంతో పవన్‌కు కేంద్రమంత్రి ఇవ్వడం ఖాయమంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆఫర్లను ఆమోదించరు. ఎందుకంటే, ఆయనకు పదవులపై ఏమాత్రం వ్యామోహం లేదు. కేవలం ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టిసారిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచార కేసు పెట్టిందనే కోపంతో.. చీరకట్టుకెళ్లి చంపేశాడు.. ఎక్కడ..?