రాజధానిపై తెదేపా సర్కారు జీవో అక్బర్ శిలాశాసనం కాదు : జీవీఎల్

గురువారం, 6 ఫిబ్రవరి 2020 (09:59 IST)
నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జారీ చేసిన జీవో.. శిలాశాసనం కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పైగా, రాజధాని ఏర్పాటు అంశం అనేది రాష్ట్రాల పరిధిలోనిదన్నారు. అందువల్ల ఇపుడు రాజధాని మార్పుపై ప్రభుత్వం నుంచి ఏదేని విజ్ఞప్తి చేస్తే దాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. 
 
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో శిలాశాసనమేమీ కాదన్నారు. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం తన పరిధిలోని అంశమైన కొత్త రాజధాని నిర్ణయాన్ని జీవో రూపంలో ఇస్తే.. కేంద్రప్రభుత్వం దానిని కూడా నోటిఫై చేస్తుందన్నారు. 
 
అయితే రాజధాని అమరావతిని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ తీర్మానం చేసిందని తెలిపారు. 'కేంద్రం చెప్పింది అర్థం కాక కాదు. అమరావతి రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారమిది. ప్రస్తుత ప్రభుత్వం రాజధానిపై నిర్ణయాన్ని మార్చుకుని ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపితే గుర్తిస్తుంది. రాష్ట్రప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకొంటుందని నిన్న స్పష్టంగా చెప్పినా కూడా.. మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
పైగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. జీవో అంటే అక్బర్‌ శిలాశాసనం కాదు. చంద్రబాబు శిలాఫలకం చెక్కారు.. దానిపై కొత్త జీవో జారీచేసే అధికారం ఎవరికీ లేదనుకుంటే అది కూడా భ్రమలో భాగమే. జీవో నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం మార్చితే దానిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. వక్రీకరణ వద్దు.. సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అంటూ హితవు పలికారు. 
 
రైతులు, వారి పక్షాన అనేక మంది ఢిల్లీ వచ్చి అనేక మందిని కలుస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నవారిని ఎవరైనా కలవొచ్చు. కానీ వారికి ఇక్కడ ఎలాంటి ఫలితం కనిపించే అవకాశం లేదు. రాజధానిని సమస్యగా చూస్తే.. దానికి సమాధానం అమరావతిలో దొరుకుతుంది గానీ దేశరాజధానిలో కాదు. పెద్దలను వారు కలవడం లో తప్పులేదు. కానీ సమాధానానికి వారు మళ్లీ అమరావతే వెళ్లాల్సి ఉంటుంది’ అని జీవీఎల్‌ తెగేసిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దేవినేని ఉమ ఆడో.. మగో తెలియట్లేదు : మంత్రి అనిల్ కుమార్