ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోమారు నోటికి పనిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగా దేవనేని ఉమ ఆడో.. మగో తెలియడం లేదని చెప్పుకొచ్చారు.
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అనిల్ పాల్గొని మాట్లాడుతూ, 'కేసీఆర్ అన్నట్టు ఉమా అంటే ఆడో, మగో తేడా తెలియదు. ఆయన సీఎంపైన, నాపైన విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. నన్ను ఉత్తర కుమారుడని ఉమా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఉత్తర కుమారుడు లోకేశ్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజకుమారుడు మందబుద్ధి, భయంతోపాటు రేలంగి లాగా సైజులున్న వ్యక్తి లోకేశే.
నాకు భయమంటే ఏమిటో తెలియదు. మండలిలో అడుగు దూరం నుంచి లోకేశ్ నన్ను చూశాడు. నా కళ్లలో కాని, గుండెలోకాని భయం కనపడిందోమో ఉత్తరకుమారుడిని అడిగి తెలుసుకోవాలి. ఎవరిని చంపి ఉమా రాజకీయాల్లోకి వచ్చాడో విజయవాడలో ప్రతి ఒక్కరికీ తెలుసు' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. పోలవరాన్ని చంద్రబాబు చేత పూర్తి చేయించడం భగవంతుడికి కూడా ఇష్టం లేదన్నారు. అందుకే శంకుస్థాపన తండ్రి చేస్తే ప్రారంభోత్సవాన్ని కుమారుడు జగన్ చేయబోతున్నాడన్నారు. 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని, దీనిని రాసిపెట్టుకోవాలని ఉమాకు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు.