ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కొడాలి నానిపై జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ గారిని, యూపీ సీఎం యోగి గారిని దూషిస్తున్న కొడాలి నాని "కలియుగ" శిశుపాలుడని చెప్పారు.
వంద సార్లు మోదీ గారిని దూషించే దాకా ఆగి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా తమ పతనాన్ని కోరి తెచుకుంటారో లేక వెంటనే తొలగించి ముఖ్యమంత్రి జగన్ తమ తప్పును గుర్తిస్తారో చూడాల్సి వుందని అన్నారు. ఇక బీజేపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కొడాలి నాని జగన్ మత్తులో వున్నారని, మెప్పుపొందేందుకు కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాధ్‌లపై అనుచితంగా మాట్లాడ్డం దారుణమని అన్నారు. కొడాలి నాని వేరొక మతంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే జగన్ ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ కొడాలి నాని పై చర్యలు తీసుకోకపోతే బిజేపి ఉద్యమిస్తుందని అన్నారు. మోడీ వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత కొడాలికి లేదన్నారు. నాని ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటోంటే జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను హిందూగా మార్చానని కనీసం శారదాపీఠం అయినా చెప్పాల్సి ఉందన్నారు. హిందూ మతానికి అన్యాయం జరుగుతుంటే శారదాపీఠం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు.
కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లే జగన్ తిరుమలకు తీసుకురావడానికి అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. కొడాలి నాని అచ్చోసిన ఆంబోతని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. కొడాలి నాని మంత్రినా..రౌడీనా? అని ప్రశ్నించారు. కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే హిందువుల శక్తి ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.