Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతికి పుట్టినరోజు, ఎవరు చేశారు? ఎందుకు చేశారంటే..?

తిరుపతికి పుట్టినరోజు, ఎవరు చేశారు? ఎందుకు చేశారంటే..?
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:49 IST)
తిరుపతి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తిరునగరి జన్మదినాన్ని పురస్కరించుకుని మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కోట్లాది మందిచే జన్మదిన శుభాకాంక్షలు అందుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జఠిగిన తిరుపతి 892వ జన్మదిన వేడుకలు ఆకట్టుకున్నాయి. 

 
జియ్యర్ స్వాములు వెంట రాగా, వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాల ఆద్యంతం భక్తి ప్రపత్తులను చాటుతూ ప్రదర్శన సాగింది. పౌరాణిక కళా బృందాల లయబద్ద విన్యాసాల నడుమ సాగిన కళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భూమన నిర్వహించిన ఆధ్యాత్మిక శోభా యాత్రను.. దారి పొడవునా పచ్చ తోరణాలు కట్టి, కర్పూర హారతులు పడుతూ, పూజలు నిర్వహిస్తూ భక్త జనులు స్వాగతించారు.  

 
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ప్రఖ్యాతులతో విరాజిల్లుతున్న నేటి తిరుపతిని 892 ఏళ్ల కిందట శ్రీ గోవింద రాజపురం గ్రామం పేరిట పునాది రాయి వేసి మరీ ఏర్పరిచిన శ్రీ రామానుజాచార్యలను స్మరించుకుని కార్యక్రమాన్ని భూమన చేపట్టారు. స్థానిక శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో శోభా యాత్రను నిర్వహించారు.

 
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ టీటీడీకి అనుసంధానం చేస్తూ భవిష్యత్‌లో ప్రపంచమంతటా తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహించేలా చర్యలు చేపడుతామని వెల్లడించారు. భగవద్ శ్రీ రామానుజాచార్యులు వారి దివ్య హస్తలతో పునాది వేసి, 892 సంవత్సరాల కిందట ఏర్పరిచిన శ్రీ గోవింద రాజపురం గ్రామం నేటి తిరుపతిగా ఏర్పడిందన్నారు. 

 
ప్రపంచంలో మరే ఇతర నగరాలకూ పుట్టిన తేదీ అంటూ లేదని, ఒక్క తిరుపతికి మాత్రమే అంతటి ప్రాశస్త్యం ఉందన్నారు. 1130 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన తన 112వ ఏట శ్రీ రామానుజా చార్యులు శ్రీ గోవింద రాజుల స్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు ఆలయ వీధులకు శంకుస్థాపన చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయిని, శాసనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కాల గర్భంలో తిరుపతి జన్మదినపు తేదీ ప్రాముఖ్యతకు నోచుకోలేక పోయినా, ఇన్నేళ్ల తర్వాతైనా ఈ తరంలో తొలిసారి జన్మదిన వేడుకలు నిర్వహించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. 

 
భావితరాలు మున్ముందు ఈ వేడుకలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్, నగర కమిషనర్ పీఎస్ గిరీష, ఎస్పీ వెంకట అప్పుల నాయుడు, నగర అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్