తెలంగాణాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వేగంగా కదులుతోంది. ఇప్పటికే ఆయన 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. దీనితో యువ మోర్చా, బీజేపీ కార్యకర్తలు సందడి చేసి, ఈ సందర్బంగా టపాసులు కాల్చి, బెలూన్లు ఎగరేశారు. 100 కేజీల కేక్ ను బండి సంజయ్ కట్ చేశారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చి కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ చేపట్టిన పాదయాత్రను వికారాబాద్ ప్రజలు ఆశీర్వదించారని బండి సంజయ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణాలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి గద్దె దింపడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ 2023లో అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. బీజేపీకి పోలీసులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని, అయితే, ప్రతి బీజేపీ కార్యకర్త డ్రెస్ వేసుకోని పోలీసేనని... ఈ విషయం పోలీసులకు తెలుసని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
పూర్వ మెదక్ జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చెయ్యాలని దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రఘునందన్ రావు కోరారు. సదాశివపేటలో యాత్ర అడుగుపెడుతోన్న సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా వచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులపాటు తనతోపాటు పాత జిల్లాకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాద యాత్రలో నడవబోతున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.