గత కొన్ని రోజులుగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రధాన శీర్షికల్లో వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకుండా తన భార్యకు ఇచ్చినా తాను ఏం చేయలేనని, ఆమె విజయానికి కృషి చేయాల్సిందేనని చెప్పారు. ఇపుడు తనకున్న అలవాటును బహిరంగంగా అంగీకరించారు. తనకు పేకాట ఆడే అలవాటు ఉందని తెలిపారు.
ఒంగోలులో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ వైకాపా నేతలు, కార్యకర్తలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ కోఆర్డినేటర్లు బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డిలు ఈ సమావేశానికి వచ్చారు.
వారిని బాలినేని కార్యకర్తలకు పరిచయం చేస్తూ, "భూమన కరుణాకర్ రెడ్డికి వాక్ చాతుర్యం ఉంది. బీద మస్తాన్ రావుతో నాకు గతంలో పరిచయం ఉంది. మస్తాన్ రావుతో చెన్నైలోనే పరిచయం ఉన్నా నాలాగా ఆయన పేకాట ఆడే వ్యక్తి కాదు. నాకు పేకాట ఆడే అలవాటు ఉంది. బీదకు లేదు" అని బాలినేని సరదాగా వ్యాఖ్యానించారు.