Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారా లోకేశ్ పాదయాత్ర.. షరతులతో అనుమతి.. 27న కుప్పం నుంచి..

nara lokesh
, బుధవారం, 25 జనవరి 2023 (11:49 IST)
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో పోలీసులు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
 
'యువత గళం' పేరుతో చేపట్టిన ఈ యాత్రకు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో రోడ్లపై సమావేశాల నిర్వహణపై నిషేధం విధించిన నేపథ్యంలో రోజుల తరబడి అనిశ్చితి నెలకొనడంతో అనుమతి లభించింది.
 
బహిరంగ సభలకు నిర్దేశించిన సమయాలను పాటించాలని నిర్వాహకులను ఎస్పీ ఆదేశించారు. రోడ్లపై సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
 
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్వాహకులను కోరారు. పాదయాత్ర సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని పోలీసులు నిషేధించగా, టీడీపీ కార్యకర్తలు, పాల్గొనేవారు ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్లరాదని ఆదేశించారు.
 
ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సభాస్థలి వద్ద ప్రథమ చికిత్స, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎస్పీ నిర్వాహకులను ఆదేశించారు.
 
లోకేశ్ పాదయాత్రకు విధించిన షరతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలనకు టిడిపి నేత పాదయాత్ర చావుదెబ్బ అని తెలిపారు.
 
పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆంక్షలు విధించారని అచ్చెన్నాయుడు అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలిన వివేకా హత్య కేసు ఫైళ్ళు