Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద్యావుడా.. చిత్తూరు జిల్లాలో ఒక పొట్టేలు 50 వేలు... ఎందుకంటే..?

Advertiesment
bakrid 2019
, శనివారం, 10 ఆగస్టు 2019 (18:13 IST)
చిత్తూరు జిల్లాలో పొట్టేళ్ళకు రెక్కలొచ్చాయి. అదేంటి.... పొట్టేళ్ళకు రెక్కలు రావడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా.. ఐతే ఇది తెలుసుకోవాల్సిందే. ముస్లిం సోదరులు వేడుకగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ ప్రధానమైనది.

అయితే ఈసారి బక్రీద్ అంటేనే హడలిపోతున్నారు ముస్లింలు. కారణం.. పొట్టేళ్ళు, మేకల ధరలు అమాంతంగా పెరిగిపోవడమే. సాధారణంగా ఒక్కో పొట్టేలు ధర 10 నుంచి 15 వేలు ఉంటూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మేకలు, పొట్టేళ్ళ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 
 
ఒక్కో పొట్టేలు ధర మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగి ఏకంగా హాఫ్ సెంచరీకి దగ్గరవుతోంది. దీంతో బక్రీద్ పండుగను జరుపుకునేందుకు సంతకు వెళ్ళినవారు పొట్టేళ్ళ రేట్లను చూసి కళ్ళు తేలేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి పొట్టేళ్ళ సంతకు పెట్టింది పేరు. జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పొట్టేళ్ళను, మేకను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. 
 
ఈసారి బక్రీద్ రావడంతో వేల సంఖ్యలో జీవాలను తీసుకొచ్చారు విక్రయదారులు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జాతుల పొట్టేళ్ళతో సంత కళకళలాడుతోంది. అయితే రేట్లు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికరంగా మారుతోంది. ఏ పొట్టేలు దగ్గరికి పోయినా మినిమమ్ 30వేలు, మాక్జిమమ్ 50 వేలు అంటుండడంతో కొనలేక.. కొనకుండా ఉండలేక మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
బక్రీద్ లో ఉపవాసం చేసి ప్రార్థన అనంతరం మాంసాహారాన్ని వండుకుని బంధువులకు, స్నేహితులతో కలిసి తినడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పొట్టేళ్ళు రేట్లు పెరిగిపోవడంతో తప్పనిసరి అప్పో,సొప్పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక  పొట్టేళ్ళ సంతలో కాశ్మీర్ నుంచి వచ్చిన పొట్టేళ్ళు, మేకలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సాధారణ పొట్టేళ్ళతో పోలిస్తే ఎత్తూ, బరువున్న వీటి ధర ఎక్కువగానే ఉంది. దీంతో సంతనిండా పొట్టేళ్ళు ఉన్నా వాటిని కొనాలంటే మాత్రం తెగ కంగారుపడి పోతున్నారు ముస్లిం సోదరులు. మొత్తం మీద ఈసారి బక్రీద్ పొట్టేళ్ళ విక్రయదారులకు లాభాలు కురిపిస్తుండగా కొనుగోలుకు వచ్చేవారికి మాత్రం జేబులు ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి