Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బద్వేల్ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం... ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి...

Advertiesment
బద్వేల్ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం... ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి...
, శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:23 IST)
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు సంబంధించి 281 బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 1,124 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. 
 
పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పిలుపునిచ్చారు. అలాగే, బద్వేలు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 
 
ఈ నెల 29న సిబ్బందికి పోలింగ్ కు సంబంధించి సామాగ్రి పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు వేసుకోవచ్చని తెలిపారు. 
 
ప్రతి ఓటరు వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే నవంబర్ 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.
పోలింగ్‌కు సంబంధించి ఎక్కడికక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కొత్త వ్యక్తులు బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉండరాదని హెచ్చరించారు. 
 
ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ వార్నింగ్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 4 రోజుల ప‌ర్య‌ట‌న‌... విజ‌య‌వాడ‌కు రానున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి