నెల్లూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ విద్యార్థిని.. కాలేజీ ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను గేమ్‌లో పోగొట్టుకుంది. ఈ విషయం తెలిసిన తల్లి కుమార్తెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన పోలు కవిత అనే విద్యార్థిని బీఫార్మసీ చదువుతుంది. 20 యేళ్ల కవిత నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తుంది. అయితే, ఆన్‌లైన్ గేమ్‌లకు బాగా అలవాటుపడిన కవిత.. కాలేజీ ఫీజు కట్టమని తల్లిదండ్రులు ఇచ్చిన రూ.2.50 లక్షల డబ్బును గేమ్‌లలో పోగొట్టుకుంది.
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా ఆన్‌లైన్ గేమ్ వ్యసనంతో నాశనం చేశావంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తల్లిదండ్రులు తిట్టారన్న మనస్తాపంతో ఐదు రోజుల క్రితం కవిత పురుగుల మందు తాగింది.
ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి చేర్చగా, చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఎదిగివచ్చిన కుమార్తె ఇలా అర్థంతరంగా తనవు చాలించడంతో ఆమె తల్లిందడ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.