Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో యంత్రం

laddu
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (15:35 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకులకు భక్తులు విశేషంగా తరలి వచ్చారన్నారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయినట్లు చెప్పారు. 
 
లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న రథసప్తమి వేడుకలకు సంబంధించిన కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఆయన.. త్వరలో మరో తేదీని నిర్ణయిస్తామని అన్నారు.
 
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం జరుగుతోందని, తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. 
 
దీని ద్వారా శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని అన్నారు. ఎస్వీబీసీ ఛానెల్‌ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించే సదుపాయం ఉంటుందని అన్నారు. గత నెలలో 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీ కానుకలు రూ.123.07 కోట్లు కాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.1.07 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారుల ఎదుట ఏపీ సీఎంవో ఓఎస్డీ