Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొన్న సచివాలయం... నేడు పర్యాటక సంస్థ ఆస్తులు.. తాకట్టేశారు...

jagan

ఠాగూర్

, ఆదివారం, 10 మార్చి 2024 (11:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. ఇపుడు గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీ టీడీసీ) ఆస్తులను తనాఖా పెట్టేశారు. జాతీయ బ్యాంకులు కాకుండా ప్రైవేటు బ్యాంకుల్లో వీటిని తనఖా పెట్టినట్టు సమాచారం. పర్యాటక యూనిట్లను తాకట్టు పెట్టడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని కొన్ని పత్రికలు ముందుగానే వార్తలు ప్రచురించాయి. ఆ వార్తలను జగన్ ప్రభుత్వం మరోమారు నిజం చేసింది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన విజయవాడ డివిజన్ పరిధిలో భవానీ ఐల్యాండ్‌తో పాటు, హరిత బెర్మ్ పార్క్ కూడా తనాఖా పెట్టిన ఆస్తుల జాబితాలో ఉన్నాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు పర్యాటక యూనిట్లను తనఖా పెట్టిన సంస్థ ఉన్నతాధి కారులు రూ.150 కోట్ల రుణం తీసుకున్నారు. మంజూరైన రుణం ఏపీటీడీసీ ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది. అప్పుగా తీసుకున్న నిధుల్లో కొంత మొత్తాన్ని పర్యాటక యూనిట్లలోని కాటేజీలు, రెస్టారెంట్లు తదితరాలను ఆధునీకరించటానికి ఏపీ టీడీపీ టెండర్లు పిలిచింది. విచిత్రమేమిటంటే... ఈ యూనిట్లన్నింటినీ ప్రైవేటు పరం చేయటానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పర్యాటక యూనిట్లకు వస్తున్న ఆదాయంలో కేవలం పావు వంతుకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి సిద్ధపడటం తీవ్ర వివాదానికి దారితీసింది. 
 
ముందుగానే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసుకోవటం చూస్తే వాటిలో ఉన్నతాధికారులకు వాటాలు ఇచ్చేలా చీకటి ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటక యూనిట్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినపుడు ఆధునీకరణ, నిర్వహణ కార్యకలాపాలను ఆ సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. అయితే వాటికోసం ఏపీటీడీసీ అప్పులు చేసి మరీ ఖర్చు చేయడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పర్యాటక యూనిట్ల కోసం పైసా ఖర్చు పెట్టకుండా వాటి ఆదాయాన్ని దెబ్బతీయటంలోనూ ప్రైవేటు కుట్ర కోణం ఉందని తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ అడ్డంపెట్టుకుని ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ ఉన్నతాధికారులు.. ఆయా సంస్థల్లో ఆధునీకరించిన ఆస్తులను ప్రైవేటు చేతిలో పెట్టేందుకు రూ.150 కోట్ల అప్పులకు కూడా సిద్ధపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ - వైజాగ్‌ల మధ్య మరో వందే భారత్ రైలు