Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

Advertiesment
apsrtc bus

ఠాగూర్

, శుక్రవారం, 23 మే 2025 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కీలకమైన 1/2019 సర్క్యులర్‌ను పునరుద్ధరిస్తున్నట్టు తీపి కబురు చెప్పింది. ఈ నిర్ణయంతో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది.
 
గతంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల విషయంలో ఈ సర్క్యులర్ మార్గదర్శకంగా ఉండేది. అయితే, దీనిని పక్కన పెట్టడంతో చిన్న చిన్న పొరపాట్లకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా, 1/2019 సర్క్యులర్‌ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దార్ యూనియన్ (ఎన్ఎంయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఇటీవల ఆందోళనలు కూడా నిర్వహించారు.
 
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఎన్ఎంయూ నాయకులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా, ఉద్యోగులు చేసే చిన్న తప్పిదాలకు కూడా తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారని, ఇది సరికాదని యూనియన్ నేతలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం, ఇకపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా 1/2019 సర్క్యులర్‌లోని నిబంధనలను పాటించాలని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఈ సర్క్యులర్‌ను అనుసరించాలని ఆదేశాల్లో పేర్కొంది.
 
తాజా పరిణామాలపై ఎన్ఎంయూ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌ను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించారు. ఈ సర్క్యులర్ పునరుద్ధరణ ప్రాముఖ్యతను ఉద్యోగులకు వివరించేందుకు శుక్రవారం రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించాలని ఎన్ఎంయూ నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!