Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్కో విక్రయాలను రూ.వెయ్యి కోట్లకు చేర్చడ‌మే లక్ష్యం: నూతన ఛైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు

ఆప్కో విక్రయాలను రూ.వెయ్యి కోట్లకు చేర్చడ‌మే లక్ష్యం: నూతన ఛైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు
, శుక్రవారం, 1 జనవరి 2021 (19:38 IST)
ఆప్కో విక్రయాలను ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు తీసుకువెళ్లాలన్నదే తన ముందున్న ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహాకార సంఘం ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు అన్నారు. విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఆప్కో నూతన ఛైర్మన్‌గా చిల్లపల్లి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

సంస్ధ నిర్వహణా సంచాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్కో పనితీరును గురించి నూతన ఛైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ దాదాపు రూ.103 కోట్ల బకాయిలు వివిధ ప్రభుత్వ శాఖల నుండి రావాల్సి ఉండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిని విడుదల చేయించి చేనేత కార్మికులకు అండగా నిలిచారన్నారు. 

చేనేత కార్మికుల పట్ల ప్రేమానురాగాలను చూపే ముఖ్యమంత్రి ఇప్పటికే నేతన్న నేస్తం ద్వారా ఆదుకుంటున్నారని, వారి జీవన ప్రమాణ స్దాయి పెంపు కోసం ఎటువంటి కార్యక్రమానికైనా సహకరించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారని వివరించారు.

కరోనా కాలంలో సైతం ఆప్కో వస్త్రాలను రాష్ట్ర ప్రజలు ఆదరించారని ఈ ఏడాది ఇప్పటివరకు రూ.26.44 కోట్ల విక్రయాలను చేసిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులను ప్రోత్సహించే క్రమంలో ముఖ్యమంత్రి ఆక్టోబర్ లో ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ apcohandlooms.com ను ప్రారంభించారని ఇది చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని చిల్లపల్లి పేర్కొన్నారు.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌గా ఉన్న అమెజాన్, గోక్యాప్, మిర్రా, ఫ్లిప్‌కార్ట్, మింట్రా, పేటిఎమ్, లూమ్‌ వంటి సంస్ధల భాగస్వామం సంస్ధ పనితీరును అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లిందన్నారు. సంస్ధ ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఈ కామర్స్ రూపంలో ఇప్పటివరకు రూ.11 లక్షల వ్యాపారం చేసామని, కరోనా కాలాన్ని అధికమిస్తే విక్రయాలు పెద్ద ఎత్తున పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

కరోనా నేపధ్యంలో మాస్క్ ల తయారీలోనూ ఆప్కో కీలక భూమికను పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా 108 షోరూమ్‌ల ద్వారా ఆప్కో విక్రయాలు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 94 షోరూమ్‌లు, ఇతర రాష్ట్రాల్లో 14 షో రూమ్‌లు ఉన్నాయన్నారు.

నూతన ఛైర్మన్‌కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన ఉద్యోగులు, నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో కేక్ కట్ చేయించారు. ఆప్కో ఆవరణలోని దేవాలయంలో చిల్లపల్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంస్ధ జీఎంలు రమేష్, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు