తల్లీ బిడ్డ హత్యకు అనుమానమే కారణమా.. అమెరికాలోనూ మనం మారలేదా?
తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడు మంచివాడైతే, గతంలో తన భార్యను వేధించకుండా ఉన్నట్లయితే, తల్లిదండ్రులకు తన బాధ పంచుకుని ఉండకపోతే అమెరికాలో ఘోర హత్యకు గురైన తమ కూతురు, ఆమె బిడ్డను అల్లుడే చంపేశాడన
తల్లీ బిడ్డలను కత్తులతో పొడిచి పొడిచి చంపగలిగనంత కిరాతకత్వం అమెరికన్లదా, భారతీయ మనస్తత్వానిదా అంటే ఎవరు సమాధానం చెప్పాలి. ప్రాథమిక విచారణ అనంతరం తేలుతున్నదేమంటే ఇది జాతి వివక్ష ప్రాతిపదికన జరిగిన హత్య కాదని అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడు మంచివాడైతే, గతంలో తన భార్యను వేధించకుండా ఉన్నట్లయితే, తల్లిదండ్రులకు తన బాధ పంచుకుని ఉండకపోతే అమెరికాలో ఘోర హత్యకు గురైన తమ కూతురు, ఆమె బిడ్డను అల్లుడే చంపేశాడని ఆ ఇద్దరు ముసలివాళ్లు ఎందుకు ప్రకటించి ఉంటారు?
35 ఏళ్ల నర్రా శశికళ, 7 ఏళ్ల హనీశ్ సాయిలను దుండుగులు గొంతు కోసి చంపేశారంటే ఇది కచ్చితంగా భారతీయ ప్రతీకార మనస్తత్వం చేయించిన ఘాతుకమే తప్ప అమెరికన్ల ప్రమేయం దీంట్లో లేదనే అనిపిస్తోంది. పైగా అమెరికన్లు చంపాలనుకుంటే ఒకే ఒక బుల్లెట్ ఖర్చు చేస్తారు తప్ప ఇలా కత్తులతో చంపాల్సిన ఖర్మ వాళ్లకేం పట్టింది?
తరచి చూస్తే వంద అనుమానాలు పుట్టుకొస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన శశికళ, ఆమె కొడుకును అంత కిరాతకంగా చంపడానికి కారణాలేమిటి. డబ్బుకోసమా కాదు. జాతి వివక్షా కాదు. మీడియా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె వివాహేతర సంబంధంలోకి వెళ్లడమా.. దాంపత్య జీవితం ఎందుకు పెటాకులైపోతోందో, ఎందుకు భద్రమైన జీవితాల్లో అనుమానాలు ప్రబలిపోయి హత్యలే పరిష్కారమవుతున్నాయో.. అమెరికాలో కూడా భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరు చెప్పాలి.
నాకు సంబంధించనది లోకంలోనే ఉండకూడదు అనే రక్తప్రతీకారం భారత గడ్డ మీద నుంచి అమెరికా వరకు ఎలా ప్రాకగలుగుతోంది? విచారణ పూర్తి కాకముందే మగాడిని లేదా భర్తను అనుమానించడం చట్టరీత్యా సరైంది కాకపోవచ్చు.. కానీ భార్యపైన అనుమానం కలిగితే చాలు... పసిబిడ్డను కూడా కాదనుకుని చిదిమేయగలిగన గొప్ప సంస్కృతి మనదా కాదా అనే ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలుసు. ఎవరు చేసి ఉంటారు అన్నది ప్రశ్న కాదు. ఎందుకు చేసిఉంటారో, చేయించి ఉంటారు అనే ప్రశ్నకు ఎన్ని సమాధానాలుంటాయో అమెరికన్లకు తెలియకపోవచ్చు కాని భారతీయులుగా మనకు తెలుసు.
జీవితాన్ని పోగొట్టుకున్న శశికళా.. నీ హత్యకు, నీ బిడ్డ హత్యకు ఎవరు కారణమో ఒక్క ఆధారమైనా భద్రపర్చి ఉంటే నీ హత్యా రహస్యం చిక్కుముడి వీడిపోయేది కదా..
వెనుకబాటుతనం నుంచి బయటపడి జీవితాన్ని స్వర్గమయం చేసుకోవాలని దేశం సరిహద్దులు దాటుతున్న వారి మనస్తత్వాలు, ప్రవర్తనలు, అభిజాత్యాలు, అనుమానాలు, రక్త ప్రతీకారాలు అమెరికాలో కూడా మనల్ని వదలలేదా? అక్కడ కూడా మన బుద్దులు మారలేదా..