Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

మాంసాహారాన్ని బ్రాహ్మణిజం బంద్ చేయించింది: తిరగబడర అన్నా అంటున్న ఆ కలెక్టర్

మాంసాహారం తిని శక్తిపెంచుకున్న మన పూర్వీకుల్లో ఉన్న బలం మళ్లీ మనకు వచ్చి టీబీ వంటి రోగాలు దాడి చేయొద్దనుకుంటే ప్రజలు తప్పకుండా అడవిపంది, పెద్ద (గొడ్డు) మాంసం వంటివి తప్పకుండా ఆరగించాలంటూ సాక్షాత్తూ జి

Advertiesment
District Collector
హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (06:04 IST)
మాంసాహారం తిని శక్తిపెంచుకున్న మన పూర్వీకుల్లో ఉన్న బలం మళ్లీ మనకు వచ్చి టీబీ వంటి రోగాలు దాడి చేయొద్దనుకుంటే ప్రజలు తప్పకుండా అడవిపంది, పెద్ద (గొడ్డు) మాంసం వంటివి తప్పకుండా ఆరగించాలంటూ సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పేర్కొనడం సంచలనం కలిగించింది. పైగా బ్రాహ్మణిజం కల్చర్‌ వచ్చి మాంసం తినొద్దంటూ బంద్‌ చేసిందని దాంతోనే ప్రజల్లో రోగనిరోధక శక్తి దారుణంగా పడిపోయిందని ఆయన పేర్కొనడం వివాదానికి దారితీసింది. పైగా అడవిపందుల్ని వేటాడి చంపి తినండి చట్టం కూడా దానికి అనుమతించిందని ఆయన సమర్థించడం గమనార్హం. 
 
క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో భూపాల పల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తినాలని సూచించారు. ‘‘మాంసం ఖరీదు అనుకుంటే పక్కనే అడవులు ఉన్నాయి. అడవి పందులను పట్టుకుని తినండి. ఎస్సీ, ఎస్టీలు పెద్ద (గొడ్డు) మాంసం తినేవాళ్లం. మధ్యలో మనకు దరిద్రపు బ్రాహ్మణ కల్చర్‌ ఒకటి వచ్చి పడింది. పెద్ద మాంసం తినొద్దు, అదీ ఇదీ అని చెప్పి బంద్‌ చేయించారు..’’ అని వ్యాఖ్యానించారు. 
 
ఒక జిల్లా కలెక్టర్ అంతమాట అన్నాడంటే ఊరికే అనలేదు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో రాత్రి నిద్రలు చేసినప్పుడు అక్కడి ముసలివాళ్లు తనవద్ద చేసిన ఫిర్యాదు కలెక్టర్‌పై ప్రభావం వేసింది. తాము గొడ్డు కూర తిన్నప్పుడు ఆరోగ్యం బాగుండేదని.. ఇప్పుడు తమ ఊళ్లలో తిననివ్వడం లేదని, బంద్‌ చేసినప్పటి నుంచి ఒంట్లో సత్తా లేకుండా పోయిందని ఊర్లలోని వృద్ధులు ఆరోపించడం కలెక్టర్‌ను కలెక్టర్‌ని కలిచివేసింది. దానికి తోడు దేశంలోనే మాయమైపోయిందనుకున్న క్షయరోగం మళ్లీ గ్రామాల్లో కనిపించడంతో దీనికి కారణం పోషక విలువలు కలిగిన మాంసం రకాన్ని ప్రజలు తినడం ఆపివేయడమే కారణమని కలెక్టర్ గ్రహించారు. 
 
ఈ ఎరుకతోనే మాంసాహారం ప్రమాదకరం, శాకాహారం ఉత్తమం అంటూ గత కొన్నేళ్లుగా దేశంలో ప్రచారమవుతున్న భావజాలంపై కలెక్టర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలోనే ఆయన దరిద్రపు బ్రాహ్మణ కల్చర్‌ అంటూ పదప్రయోగం చేశారు. పైగా ‘పిచ్చి మాలలు (దీక్షలు) వేసుకుని పంది మాంసం తినడం జనం మానేస్తున్నారని, అది శుద్ధ దండగ అని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఏం తినాలో అది తినాలన్నారు. 
 
అడవిపందులను పట్టుకుని ఆరగిస్తే తప్పేమీ లేదన్నారు. గ్రామాలపై పడి పంటలను మట్టగిస్తున్న అడవిపందులను చంపినా నేరం కాదని, ఎలాంటి కేసులు ఉండవని అటవీ శాఖ చేసిన ప్రకటనను కలెక్టర్ గుర్తు చేశారు. అయితే నెమలి, దుప్పి వంటి వన్య ప్రాణులను మాత్రం చంపొద్దని, వాటి మాంసం తినొద్దని కలెక్టర్ హెచ్చరించారు. అధికార బాధ్యతల్లో భాగంగా తాను ఒకసారి చైనాకు వెళ్లినప్పుడు అక్కడ కుక్కమాంసం కూడా తిన్నానని తనకేం కాలేదని కలెక్టర్ చెప్పారు. 
 
మాంసాహారం అవసరాన్ని ఇంత పవర్‌పుల్‌గా ప్రకటించిన కలెక్టర్ చివరలో బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. పేద ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంగా దీక్షలు మానుకోవాలని, బ్రాహ్మణిజం అనే పదాన్ని ఉచ్చరించానని, ఈ విషయంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని ఉంటే చింతిస్తున్నానని, ఆ పదం వాడినందుకు క్షమించాలి అని కలెక్టర్ తెలిపారు. 
 
అయితే టీబీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని.. పంది, గొడ్డు మాంసం తినాలని సూచించడంలో తానే తప్పూ చేయలేదని, అడవి జంతువుల మాంసాహారం సామాన్య ప్రజలకు చాలా అవసరమని కలెక్టర్ మురళి తెలిపారు. 
 
క్షయ వ్యాది వస్తే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పెద్ద (గొడ్డు) మాంసం తినాలని మాంసాహారంలోనే అతి శక్తివంతమైన గొడ్జు మాంసం తింటేనే క్షయ త్వరగా తగ్గుతుందని గతంలో డాక్టర్లు పదే పదే చెప్పేవారు. దీంతో అంతవరకు గొడ్డు మాంసం వాసన కూడా చూడని ఎఫ్‌సి, బీసీ కులాల ఇళ్లల్లో క్షయ రోగులకు పెద్దమాంసం వండి తినిపించిన ఘటనలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా జరిగాయి.
 
ఈ నేపథ్యంలో కలెక్టర్ అడవి జంతువుల మాంసాన్ని నిక్షేపంగా తినవచ్చంటూ చేసిన ప్రకటనను పాజిటివ్‌గానే తీసుకుంటే మంచిదేమో మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉన్న ఏటీఎంలను తీసేస్తున్నారు. కొత్త ఎటీఎంలు ఉండవ్.. పదివేల విత్‌డ్రాకే పరిమితం