గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదనీ, కానీ విధ్వంసాలు మాత్రం ప్రారంభం నుంచే మొదలయ్యాయని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారాంతం వస్తే విశాఖలో కొనసాగుతున్న విధ్వంసాలపై అచ్చెన్న మాట్లాడుతూ, 'వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కట్టింది ఒక్కటి లేకపోయినా విధ్వంసాలు మాత్రం అనేకం చేస్తోంది. వారాంతం వస్తే విశాఖలో విధ్వంసాలకు తెర లేస్తోంది. అది కూడా టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారు' అని ఆయన అన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములపై తాజాగా అధికారుల దాడిని ఆయన ఖండించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భూములపై అనేక పరిశీలనలు చేశారన్నారు. అందులో ఏమీ దొరక్క చివరకు ఒక చెరువుకు చెందిన రెండు అడుగుల స్థలం ఆక్రమించారని ఆరోపిస్తూ ఫెన్సింగ్ పీకేశారన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.
ఇకపోతే మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ నాయకులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసై పోయిందా! అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. విశాఖలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూమిపై అధికారులు దాడి చేసి ఫెన్సింగ్ పీకివేయడంపై ఆదివారం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు.