ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తూ, తెలంగాణాకు బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నఉద్యోగులు కొందరు తెలంగాణ నేటివిటీ కలిగి ఉండడం, తమ భాగస్వాములు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉండటం వంటి కారణాల వల్ల తమను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్నిఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫార్మ్స్ సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో విధి విధానాలను విడుదల చేయబోతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్
కె వెంకట రామి రెడ్డి తెలిపారు.
ఏపీ, తెలంగాణా విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులు హైదరాబాదు నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఇక్కడ అమరావతిలో సచివాలయం నిర్మించగానే, చాలా మంది హైదరాబాద నుంచి అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది నిత్యం హైదరాబాదు నుంచి విజయవాడకు వస్తున్నవారున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.