ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార వైకాపాను ఓటర్లు అధఃపాతాళానికి తొక్కేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విస్పష్ట తీర్పుతో వైకాపాకు చుక్కలు కనిపించాయి. ఫలితాల్లో ఆ పార్టీ కనీస స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఓ దశలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. ఇంతటి ఘోర పరాభవానికి కారణాలు లెక్కలేనన్ని.
అయితే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతలు వాడిన భాష. అది వైకాపా పట్ల ప్రజల్లో చులకన భావం కలిగేలా చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో విపరీత పోకడలు మొదలయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని ఆగర్భ శత్రువుల్లా చూడటం, రాయలేని రీతిలో తిట్టించడాన్ని వారి పనితీరుకు కొలమానంగా వైకాపా అగ్రనాయకత్వం భావించింది.
ముఖ్యంగా, తమ పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు, బాధ్యత గల పదవుల్లో ఉన్న మంత్రులు నోరు పారేసుకున్నారు. మంత్రులు అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్, ఆర్కే రోజాతో పాటు తొలి రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వాడిన భాష అత్యంత జుగుప్సాకరం.
ప్రతిపక్ష నేతల విమర్శలకు హుందాగా సమాధానం చెప్పాల్సిన వాళ్లు.. ప్రతిపక్ష నేతలపై ఇష్టారీతిన బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. ప్రజలు వినలేని, రాయలేని పదాలతో తిట్టిపోశారు. అసభ్య పదజాలం వాడితేనే తమ అధిష్ఠానం వద్ద మార్కులు పడతాయని భావించారు. పార్టీ అధినేత మనసెరిగిన కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి స్థాయిని, హోదాను మర్చిపోయారు. శాసనసభలో ఉన్నామా, బహిరంగ సభలో మాట్లాడుతున్నామా... అన్నది కూడా చూసుకోకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని దారుణమైన బూతులు తిట్టించడం పరిపాటిగా మారింది.
ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైకాపా మంత్రులు వ్యవహరించారు. శాసనసభ ప్రతిష్ఠను మంటగలిపారు. నిండు సభలో చంద్రబాబుపై కొందరు వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేతగా ఆయనకు ఉన్న హక్కును కూడా కాలరాశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా నియంతృత్వ పోకడలతో నడుపుతున్న కౌరవ సభలో ఉండలేనంటూ చంద్రబాబు బయటకు వెళ్లారు. మళ్లీ సీఎంగానే అడుగుపెడతానంటూ శపథం చేశారు. మరోవైపు పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సీఎం జగన్ సహా మంత్రులు పదేపదే వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు కుటుంబంతో పాటు పవన్‌పై వైకాపా నేతలు వాడిన భాష ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఎన్నికల్లో దాని ప్రభావం ప్రజా తీర్పు రూపంలో స్పష్టంగా వెల్లడైంది. బూతుల్లో ఆరితేరిన వారంతా నేడు ఓటమి పాలయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. గుడివాడలో కొడాలి నాని, పెనమలూరులో జోగి రమేశ్, పలాసలో సీదిరి అప్పలరాజు, నగరిలో ఆర్కే రోజాకు ఓటమి తప్పలేదు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని తన కుమారుడు క్రిష్ణమూర్తి (కిట్టు)ని బరిలోకి దించినా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయారు. మొత్తంమీద వైకాపాలోని బూతు మంత్రులకు ఏపీ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన చందంగా తీర్పునిచ్చారు.