ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బోరున విలపించారు. అదీ కూడా తాను పుట్టిన పురిటి గడ్డపైనే. తాను రాజకీయ కాంక్షతోనే కడప లోక్‌సభకు పోటీ చేస్తున్నట్టు తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. పైగా, తాను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టుకున్నారు.
'రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశా. మీ భవిష్యత్ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. పాదయాత్ర సమయంలో వైకాపా అంతా నా చుట్టే తిరిగింది. నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైకాపాను నేను హైజాక్ చేసేదాన్ని కాదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? మీరు వైఎస్‌ఆర్ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు' అని షర్మిల గుర్తు చేశారు.
'ఆనాడు ప్రతి సభలో, ప్రతి అడుగులో జగన్ కోసం కాలికి బలపం కట్టుకొని నేను తిరగలేదా? ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందంటున్నారే.. అదే ఉంటే నేను పొందాలనుకున్న పదవి మీ పార్టీలో మొండిగానైనా పొందగలను. వివేకానంద రెడ్డి లాంటి వారు నాకు అండగా నిలబడ్డారు.. నన్ను ఎంపీగా చేయాలని ప్రయత్నించిన ఎంతో మంది మీ పార్టీలోనే ఉన్నారు. అందరి అండ చూసుకొని ఏ రోజైనా అలా వ్యవహరించానా? నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? మీరు సీఎం అయ్యేంత వరకు అన్న కోసమని, రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన మీరు మళ్లీ తీసుకొస్తారని నమ్మి నేను మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా?
మనిద్దరం నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను.. నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను ప్రమాణం చేయగలను. మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌పై ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయకాంక్ష ఉందని, డబ్బు కాంక్ష ఉందని గానీ రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను' అంటూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు.
'జగన్ సోషల్ మీడియా ద్వారా నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రాజన్న బిడ్డనన్న ఇంగితం లేకుండా నాపై, నా పుట్టుకపై రాక్షస సైన్యంతో ప్రచారం చేయిస్తున్నారు. నాపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్ చరిత్రలో నిలిచిపోతారు. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? జగన్‌కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది.. అందుకే భ్రమల్లో బతుకుతున్నారు. జగన్ మానసిక పరిస్థితిపై నాకు నిజంగానే ఆందోళన ఉంది. మాట మాట్లాడితే నేను, సునీత చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ అని, ఆయన చెప్పినట్లు చేస్తున్నామని అంటున్నారు' అంటూ షర్మిల మండిపడ్డారు.