Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎంను కలవనీయకుండా అడ్డుకుంటున్నారు ... ఎవ‌రా ముగ్గురు?

Advertiesment
ap ngo leaders
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (15:40 IST)
ఆంధ్రప్ర‌దేశ్ ఎన్జీవోలు అడ్డం తిరుగుతున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ ని క‌ల‌వ‌నీయకుండా ఆ ముగ్గురు అడ్డుకుంటున్నార‌ని ఎన్జీవో నేత‌లు ఆరోపిస్తున్నారు. పీఆర్సీతోపాటు తమ అన్ని డిమాండ్లపై మరోసారి ఉద్యమబాట పట్టేందుకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి సమాయత్తం అవుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, ఈనెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించాయి. 
 
 
విజయవాడలోని ఎన్‌జీవో హోంలో ఐకాసల ఐక్యవేదిక సమావేశం నిర్వహించగా, అన్ని సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వం తీరు, ఉద్యమ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ హామీ ఇచ్చినా అనంతరం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని గుర్తు చేశారు. హామీలిచ్చిన మంత్రి, సీఎస్‌తోపాటు చర్చలు జరిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మలి విడత సమావేశాలకు రాకపోవడంపైనా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సీఎం జగన్‌ను కలవకుండా ఈ ముగ్గురూ అడ్డుకుంటున్నట్లు ప్రకటించాయి. పీఎఫ్‌, బీమా వంటి వాటిపై రుణానికి చేసుకుంటున్న దరఖాస్తులు పెరుగుతున్నాయే తప్ప, పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాయి.
 
 
ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. స్నేహపూర్వకంగా ఉంటున్నా మాపై వివక్ష చూపుతూ... ఉద్యమ కార్యాచరణలోకి దిగేలా ప్రభుత్వమే చేస్తోంది. ఐకాసల విస్తృత స్థాయి సమావేశాన్ని 9న నిర్వహించనున్నాం. అనంతరం పోరాట కార్యాచరణను ప్రకటిస్తాం. ఈలోపు సీఎం జగన్‌ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. సీఎం వద్దకు వారం రోజుల్లో తీసుకెళ్తామని సీఎస్‌ ఇచ్చిన హామీ అమలు కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం... తర్వాత జరిగిన సమావేశాలకు రాలేదు. మా 71 డిమాండ్లలో ఒక్కటీ పరిష్కారం కాలేదు. చర్చల్లో మా డిమాండ్లను అడుగుతున్నారే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు ఉండడం లేదు. సీఎం జగన్‌తో తప్ప అధికారులతో నిర్వహించే సమావేశాలతో ఎలాంటి ఉపయోగం లేద‌ని ఎన్జీఓ నేత బండి శ్రీనివాస‌రావు తెలిపారు.
 
 
సీఎం జగన్‌తో చర్చలు జరగకుండా మంత్రి బుగ్గన, సీఎస్‌ సమీర్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నార‌ని  బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. మేం ధర్మ పోరాటం చేస్తాం. 2013-14 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయం ఏమీ తగ్గలేదు. ఫిట్‌మెంట్‌ 28% ఇస్తే రూ.3,100 కోట్లు, 45% ఇస్తే రూ.8వేల కోట్లు మాత్రమే భారం పడుతుంది. సమస్యల పరిష్కార బాధ్యతలను తీసుకుంటామని బుగ్గన, సమీర్‌ శర్మ, సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని వాయిదా వేశాం. అనంతరం జరుగుతున్న చర్చలు ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉన్నాయి. మా ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని  బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజృంభిస్తున్న ఒమిక్రాన్ వైరస్ - పంజాబ్‌లో విద్యా సంస్థల మూసివేత