Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనిచేసే స్థలంలో లైంగిక వేధింపులు లేకుండా వుండేందుకు...

పనిచేసే స్థలంలో మహిళలపై వేధింపులను సహించేది లేదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత పేర్కొన్నారు. అమరావతి, సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్

Advertiesment
పనిచేసే స్థలంలో లైంగిక వేధింపులు లేకుండా వుండేందుకు...
, శుక్రవారం, 16 మార్చి 2018 (19:17 IST)
పనిచేసే స్థలంలో మహిళలపై వేధింపులను సహించేది లేదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత పేర్కొన్నారు. అమరావతి, సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిపుణులు, ప్రొఫెసర్స్, పోలీస్ శాఖ వారు చట్టంలో ఉన్న విధివిధానాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2013వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం చట్టాన్ని అమలులోకి తెచ్చినా చాలామందికి దీనిపై అవగాహన లేదన్నారు. పనిచేసే స్థలంలో లైంగిక వేధింపులు లేకుండా గౌరవంగా పనిచేయడం మహిళలకు హక్కుగా భారత ప్రభుత్వం కల్పించిందన్నారు. పనిచేసే ప్రతి మహిళకు అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 33 శాఖల్లో ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో త్వరలో కమిటీలు ఏర్పాటు చెయ్యాలని అధికారులకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. 
 
మహిళలు పనిచేసే చోట ఏమైనా వేధింపులకు గురవుతున్నట్లయితే డిప్రెషన్‌కు లోనవకుండా కుటుంబ సభ్యులతో లేదా తోటివారికైనా తెలియజేసి వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలన్నారు. మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో కూడ ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చెయ్యాలన్నారు.
 
మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆందోళనలకు గురికాకుండా ఈ కమిటీ చూసుకుంటుందని మంత్రి తెలియజేశారు. సురక్షితమైన పని స్థలం కోరుకోవడం మహిళల హక్కు అని మంత్రి అన్నారు. పనిచేసే స్థలం వద్ద వేధింపులు జరిగినప్పుడు కుటుంబం పరువుపోతుందనో, అధికారులు ప్రతీకారంతో ఏం చేస్తారో అని మహిళలు భయపడకుండా ఫిర్యాదులు చేసినప్పుడే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోగలుగుతామన్నారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ కమీషనర్ అరుణ్ కుమార్, సెక్రటరీ కె.సునీత, ప్రొఫెసర్ శాంతి, అడ్వకేట్ అనుపమ, ఇన్‌స్పెక్టర్ అరుణ మరియు సచివాలయంలోని మహిళా ఉద్యోగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ తల్లి శరీర సౌష్టవం సూపర్బ్.. నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో...