Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ సిటీగా అమరావతి... కేంద్రం రూ.2500 కోట్లిస్తామంది... మంత్రి నారాయణ

అమరావతి: నూతన రాజధాని ప్రాంతం అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటిక

స్మార్ట్ సిటీగా అమరావతి... కేంద్రం రూ.2500 కోట్లిస్తామంది... మంత్రి నారాయణ
, శుక్రవారం, 23 జూన్ 2017 (22:16 IST)
అమరావతి: నూతన రాజధాని ప్రాంతం అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన కేంద్రం, తాజాగా అమరావతిని కూడా ఆ జాబితాలో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతి.. స్మార్ట్ సిటీగా ఎంపికవడానికి కృషి చేసిన అధికారులందరినీ అభినందిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన నగరాలకు కేంద్రం వంద కోట్ల రూపాయలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో నిధులివ్వడంతో పాటు, అవసరమైతే పీపీపీ పద్దతిలోనూ మరిన్ని నిధులు సేకరించి ఆయా నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖపట్నానికి రెండొందల కోట్ల రూపాయలు కేటాయించగా, తిరుపతి నగరాన్ని వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. 
 
అమరావతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతో పాటు పీపీపీ పద్దతిలోనూ మరో 500 నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి వచ్చే ఐదేళ్లలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలతో పాటు మరో ఆరు నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసి.. అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇందుకోసం బడ్జెట్ లో నిధుల కేటాయింపు కూడా జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని.. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి.. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చేయబోతున్నామన్నారు.
 
అమృత్ పథకంలో ఏపీ నంబర్ వన్ : 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో తాము తీసుకొచ్చిన సంస్కరణలు... ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాయన్నారు మంత్రి నారాయణ. తాము ప్రవేశపెట్టిన సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తున్న అధికారులను అభినందిస్తున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మున్సిపాలిటీల్లోనూ ఈ గవర్నెన్స్, డబుల్ ఎంట్రీ అకౌంట్ సిస్టం, అర్బన్ ప్లానింగ్, బిల్డింగ్ బైలాస్ తదితర అంశాల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 96.96 పాయింట్లు సాధించి, నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఆ తరువాతి ఒడీషా 92 పాయింట్లతో రెండో స్థానంలో ఉందన్నారు. 
 
మొత్తం 13 విభాగాల్లో సంస్కరణలు చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించగా, 10 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు వందశాతం మార్కులు పడ్డాయన్నారు. మిగిలిన మూడు విభాగాల్లో పాయింట్ల శాతం కొద్దిగా తగ్గిందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తమ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. 110 మున్సిపాలిటీల్లో చెత్త ఎక్కువగా వేసే 10 వేల  ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి.. ఎప్పటికప్పుడు చెత్త ఎత్తివేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపాలిటీల్లో ఐదున్నర లక్షల ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేసి, విద్యుత్ ఆదా చేస్తున్న రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 
 
అన్ని మున్సిపాలిటీల్లోనూ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనాన్ని పెంచడంతో పాటు, సెంట్రల్ డివైడర్లు నిర్మించి, వాటిలోనూ మొక్కలు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే పోస్టర్లు లేని ప్రాంతాలుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో వీధి కుక్కలకు సంతానం కలక్కుండా చర్యలు తీసుకుంటున్నామని, మరో మూడు నెలల్లో మొత్తం మూడు లక్షల 45 వేల కుక్కలకు సంతానయోగ్యం లేకుండా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అలాగే పందుల సమస్య లేకుండా.. వచ్చే మూడు నెలల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక హాస్టల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. 
 
217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రాజధాని ప్రాంతం అమరావతి అభివృద్ధికి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని.. తాము మరిన్ని నిధులు కావాలని అడుగుతున్నామని.. ఇప్పటికే కేంద్రం రూ.1500 కోట్ల రూపాయలిచ్చిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ సి.ఎల్.వెంకటరావు, పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరానికి రూ.3.5 కోట్లు కావాలి... ఎర్రచందనం అమ్ముకుంటాం... సీఎం చంద్రబాబు