పోలవరానికి రూ.3.5 కోట్లు కావాలి... ఎర్రచందనం అమ్ముకుంటాం... సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను సత్వరమే విడుదల చేయాలని, పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు న
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను సత్వరమే విడుదల చేయాలని, పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోమ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పాత్రికేయులకు వివరించారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన 12,500 హెక్టార్ల భూమిని ఇవ్వాలని, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పరిశ్రమల ఏర్పాటుకు 10,000 ఎకరాల అటవీ భూమిని కేటాయిస్తూ అనుమతి మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ను ఆయన గృహములో కలసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిల్వ వున్న ఎర్ర చందనంను ఎప్పటికప్పుడు విక్రయించుటానికి అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలు వున్నాయని, పరిశ్రమల కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అనువుగా వున్నదని ఇందుకు అవసరమైన గ్యాస్ పైప్‌లైన్‌లను ఎన్నూరు, కృష్ణపట్నం, తిరుపతి, నెల్లూరు నుంచి విజయవాడకు పైప్ లైన్లు వేసేందుకు అవసరమైన అనుమతి, నిధులను మంజూరు చేయాలని పెట్రోలియం శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. కెజి బేసిన్లో గ్యాస్ నిల్వలు వినియోగంతో పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్, ఓఎన్‌జిసీ, బ్రిటిష్ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఉజ్వల పథకం క్రింద పేద ప్రజలకు ఇస్తున్న గ్యాస్ కనెక్షన్ల డేటాలో లోపాలను సవరించాలని దీనివల్ల షెడ్యూలు కులాలు, షెడ్యులు తెగలు, పేదవర్గాల కుటుంబాలకు మేలు చేకూరుతుందని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు.
ఏకీకృత సర్వీస్ విధానం వల్ల ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు మేలు
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ విధానంకు ఆమోదం పొందడం ముదావహం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ విధానం సాధనకు 1998 నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించి చేసిన కృషి ఫలితంగా నేడు కార్యరూపం దాల్చడం సంతోషదాయకం అన్నారు. ఈ విధానం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులతో పాటు ఎంతో మేలు చేకూరనుందని అన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇతర కేంద్ర మంత్రులకు కృతఙ్ఞతలు తెలియచేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు
కాలికి స్వల్ప గాయంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి ఆయనతో చర్చించారు.
ముఖ్యమంత్రి వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్, కొనకళ్ళ నారాయణ రావు, గల్లా జయదేవ్, మాగంటి వెంకటేశ్వర రావు, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ తదితరులు వున్నారు.