Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ-ఏపి మధ్య వివాదాల్లేవు... కానీ సెక్షన్ 108 పొడిగించాల్సిందే... కాల్వ, పరకాల

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించమని కేంద్ర ప్రభుత్

తెలంగాణ-ఏపి మధ్య వివాదాల్లేవు... కానీ సెక్షన్ 108 పొడిగించాల్సిందే... కాల్వ, పరకాల
, శుక్రవారం, 19 మే 2017 (20:20 IST)
అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం 1వ బ్లాక్ లోని తన కార్యాలయంలో శుక్రవారం చట్టం అమలును పర్యవేక్షించే ఉన్నతాధికారులతో సమావేశమై చట్టం అమలు తీరును, స్థానికత, సెక్షన్ 108, షెడ్యూల్ 9,10 తదితర అంశాలను సమీక్షించారని తెలిపారు. 
 
అనంతరం సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశమందిరంలో కాలువ శ్రీనివాసులు, పరకాల ప్రభాకర్‌లు సమావేశం వివరాలను  మీడియాకు తెలిపారు. చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పొందుపరిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు వంటి 231 సంస్థల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే సెక్షన్ 108 ప్రకారం వాటిని రాష్ట్రపతికి తెలియజేసే అవకాశం ఉందన్నారు. అయితే జూన్ 1తో ఆ సెక్షన్ కాలపరిమితి ముగుస్తుందని, ప్రస్తుతానికి సమస్యలు ఏమీ లేకపోయినా, భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకొని ముందు జాగ్రత్తతో ఆ సెక్షన్‌ను రెండేళ్లు పొడిగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
ఉన్నత విద్యా మండలికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, దానికి విరుద్దంగా కేంద్రం జారి చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఏదైనా సంస్థ ప్రధాన కార్యాలయం ఏ భవనంలో ఉంటుందో దానినే హెడ్ క్వార్టర్ అనాలని, ఆ ప్రాంగణం మొత్తాన్ని పరిగణించరాదు, అయితే ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమని ఆయన తెలిపారు. 9వ షెడ్యూల్ లోని 64 సంస్థలకు సంబంధించి షీలా బిడే కమిటీ అధ్యయనం చేసి సిఫారసులు చేసినట్లు. ఇంకా 35 సంస్థల సిబ్బంది విభజన ఆమోదించవలసి ఉందని తెలిపారు. 
 
విభజన చట్టంలోని హక్కులను చాలావరకు రాబట్టామని, అందులో లేనివి కూడా సాధించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ తరచూ గవర్నర్ తో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఆ సమావేశాలకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. 
 
రాష్ట్ర ప్రయోజనాలు పొందే విషయంలో రాజీలేదన్నారు. మనకు రావలసినవాటిని సాధించుకోవడంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంతోపాటు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు.  అయితే ఇంకా పరిష్కారం  కాని అంశాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నట్లు మంత్రి చెప్పారు. అన్ని అంశాలను తెలియజేస్తూ ఈ నెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు. చట్ట ప్రకారం రావలసినవన్నీ దక్కించుకోవడానికి న్యాయం జరిగే వరకు కేంద్రం ద్వారా ప్రయత్నిస్తామన్నారు. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించి రావలసిన ఆస్తులను రాబడతామని చెప్పారు. అలా  కాని పక్షంలో సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. త్వరలో తామిద్దరితోపాటు ఉన్నతాధికాలు కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రిని, హాం శాఖ అధికారులను కలిసి అన్ని అంశాలను వివరిస్తామని చెప్పారు. 
 
వివాదాలు లేవు ఇబ్బందులే : డాక్టర్ పరకాల
ఉన్నత స్థాయిలో దఫదఫాలుగా సమావేశమవుతూ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. విభజన విషయంలో ఇరు రాష్ట్రా మధ్య వివాదాలు ఏమీలేవని, ఇబ్బందులు మాత్రమే ఉన్నాయని, పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని వివరించారు. ముందుజాగ్రత్త చర్యగా సెక్షన్ 108ని పొడిగించమని కోరుతున్నట్లు తెలిపారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ విడిపోయి ఇంతకాలమైనా వాటికి సంబంధించిన ఆస్తులు తరత్రా విభజనలు ఇంతవరకు పూర్తికాని విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఆస్తులు, నగదు, భవనాలు, అప్పుల విభజనను పున:పరిశీలించమని విజ్ఙప్తి చేస్తున్నట్లు తెలిపారు. 
 
దక్షిణాది రాష్ట్రాలతోపాటు అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.  కొన్ని క్లిష్టమైన అంశాలు ఉంటాయని, త్వరగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్థానికత అంశం కూడా జూన్ 1తో ముగుస్తుందని, దానిని మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని అంశాల్లో న్యాయం పొందేందుకు చివరి వరకు అన్ని విధాల ప్రయత్నిస్తామని, హక్కులను సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళతామని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తామని డాక్టర్ పరకాల చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓపీఎస్‌కు మోడీ పిలుపు.. సీఎం రేసులో రజనీకి పోటీ? బీజేపీలో చేరమంటారా?