సొంత పార్టీ నేతలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకేనా బాధలు.. మాకు లేవా ఏంటి... ఉండే ఉండు పోతే పో అంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో సొంత పార్టీకి చెందిన నేతలపై ఆయన మండిపడిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శనివారం ఇక్కడ జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కిన ఆయన వద్దకు ఎస్.కోట పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ రహమాన్ వెళ్లారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించిన వారికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వారిని అందలం ఎక్కిస్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? అటువంటి వారి వల్ల నియోజకవర్గంలో చాలా బాధలు పడుతున్నాం' అంటూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మంత్రికి ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పక్కనే ఉన్నారు. ఇలాంటివి మాట్లాడడానికి సమయం కాదని.. ఏమైనా ఉంటే విజయనగరం వచ్చి మాట్లాడాలంటూ మంత్రి బదులిచ్చారు. రహమాన్ ఇంకా ఏదో చెప్పబోతుండగా మంత్రి ఒక్కసారిగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో.. ఏం మాట్లాడుతున్నావు. బాధలా, ఏంటి నీ బాధలు, నీకేనా మాకు లేవా బాధలు. ఇక్కడ బాగా క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోయింది. నువ్వే పోటుగాడివా, వీరందరికీ చేతగాదనుకున్నావా రాజకీయం చేయడం?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను వీడియో తీస్తున్న వారిపై కూడా మంత్రి మండిపడ్డారు.