Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 ఖరీఫ్ కల్లా పోలవరం నుంచి నీళ్ళిస్తాం : మంత్రి అనిల్

Advertiesment
Anil Kumar Yadav
, బుధవారం, 2 జూన్ 2021 (16:34 IST)
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించిన అనంతరం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తాం. దాని ప్రకారం ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. 
 
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మూడేళ్ళ పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, చివరి రెండేళ్ళు హడావుడి చేసి ఈరోజు ప్రభుత్వంపై టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ, దద్దమ్మల్లా విమర్శలు చేస్తున్నారన్నారు. 
 
కోవిడ్ కష్టకాలంలోనూ ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నాం. కోవిడ్‌ను సాకుగా చూపించి మేం వెనకడుగు వేయటం లేదు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో మొత్తం 80 మంది సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించినా ఎక్కడా పనులు ఆపలేదు. గత ఏడాదికి పైగా కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నా, వేలాది మంది కార్మికులు ధైర్యంగా పనిచేస్తున్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదు. కోవిడ్ నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంలో, చంద్రబాబు, ఆయన కొడుకు పట్టుమని పది రోజులు కూడా బయటకు రాలేదు. మీవేనా ప్రాణాలు, అధికారులవి, కార్మికులవి ప్రాణాలు కాదా..? అని నిలదీశారు. 
 
ఇళ్ళల్లో బెడ్ రూముల్లో కూర్చుని, జూమ్ టీవీల్లో పసలేని విమర్శలు చేస్తున్నారు. గత సీజనులో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వేలాది మంది సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈరోజు కార్మికులు కూడా దొరకడం లేదు. కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి, కనీసం రోడ్డు వేయాలన్నా కార్మికులు దొరకని పరిస్థితి అన్నిచోట్లా ఉందన్నారు. 
 
అలాంటి కోవిడ్‌లోనూ కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్న సిబ్బందిని అభినందించాలి, అది ఎటూ టీడీపీకి చేతకాదు. పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క చిన్న కార్మికుడికి మనస్ఫూర్తిగా మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు హయాంలో పోలవరం కాఫర్ డ్యామ్‌ను సక్రమంగా కట్టకపోవడం వల్ల, ప్రణాళికా లోపం వల్ల, డయాఫ్రం వాల్ డ్యామెజ్ అయింది. దీనికి కారణం మీరు కాదా..? అని మంత్రి నిలదీశారు. 
 
ఇది చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం వల్ల కాదా..? ఇవన్నీ కప్పిపుచ్చి, దాచిపెట్టి మాపై విమర్శలు చేస్తారా.. ? టీడీపీ హయాంలో ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి ఒక్క ఇల్లును అయినా మార్చారా..? లేదు. పోలవరం ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి కూడా సమీక్ష చేశాం. ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి 17 వేల ఇళ్ళను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో వేలల్లో కేసులు వస్తున్నాయి. పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఎన్ని సమస్యలు ఉన్నా, కచ్చితంగా ఈ సీజన్ లో నూటికి నూరు శాతం వారికి పునరావాసం కల్పించి తీరుతాం.  సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళుతున్నట్టు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ.. లో దుస్తులు కొనుక్కోవాలి.. షాపులు తెరవండి..