ఏపీ టూరిజం ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు రూ. 10,000 కోట్లు ఆదాయం
అమరావతి: ఏపీ టూరిజం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ ఆమోదాన్ని కోరుతూ, ఆమె అసెంబ్లీలో పర్యాటకశాఖ లక్ష్యాలను వివరించారు. వచ్చ
అమరావతి: ఏపీ టూరిజం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ ఆమోదాన్ని కోరుతూ, ఆమె అసెంబ్లీలో పర్యాటకశాఖ లక్ష్యాలను వివరించారు. వచ్చే 2020 నాటికి పది వేల కోట్ల రూపాయల ఆదాయం, 8 శాతం జిడిపి లక్ష్యాన్ని సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారని మంత్రి తెలిపారు. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సరికొత్త వాటర్ పాలసీని కూడా రూపొందిస్తున్నామన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 49 ఎంఓయులు పర్యాటకశాఖ చేసిందని, ఇందులో హోటళ్ళు, రిసార్ట్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, కన్వెషన్ సెంటర్లు, అడ్వెంచర్ యాక్టవిటీస్ ఉన్నాయని అఖిల ప్రియ తెలిపారు. ఈ ఏడాది 19 మెగా ఈవెంట్స్ నిర్వహించామని, వాటికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివరించారు. ఏపీ పర్యాటక శాఖ సర్వీస్ పార్టనర్ షిప్ కింద ఓలా, రెడ్ బస్, మేక్ మై ట్రిప్, జూమ్ కార్స్, ట్రిప్ అడ్వయిజర్, తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. నేషనల్ టూరిజం అవార్డ్ తో పాటు ముంబై ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫేర్ ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్దు, హెరిటేజ్ కేటగిరీలో స్వచ్చ అంధ్ర మిషన్ ప్రశంసా అవార్డులు మన రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు.
రూ.183 కోట్లతో స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులు
గిరిజన పర్యాటక సర్క్యూట్లను స్వదేశీ దర్శన్ పథకం ద్వారా 183 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో చేపడుతున్నామని పర్యాటక శాఖ మంంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. ట్రయిబల్ టూరిజం సర్క్యూట్ కింద అనంతగిరి, బుర్రా గుహలు, లంబ సింగి, దాలపల్లె తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్ కింద లేపాక్షి దేవాలయం, పెనుగొండ, గుత్తి పోర్ట్ , బుగ్గరామలింగేశ్వరం, బెలూన్ కేవ్స్, గండికోట, అహోబిలం అభివృద్ధికి 136 కోట్ల రూపాయలతో అంచనాలు పంపామని తెలిపారు.
లంబసింగిలో పర్యాటకులకు 5 కోట్ల రూపాయలతో సౌకర్యాలు కల్పిస్తున్నామని, బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధికి 52 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అరకులో ట్రయిబల్ కల్చర్ సెంటర్ ఏర్పాటుకు 5 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. పది కోట్లతో శిల్పారామం, భవానీ ద్వీపం అభివృద్ధి చేయనున్నామని మంత్రి అఖిల ప్రియ పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ రీజియన్లో పర్యాటక అభివృద్ధికి 42 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయన్నారు. వీటితోపాటు మన సంస్కృతికి పట్టుకొమ్మలైన కళాకారులకు 20 కో్ట్ల రూపాయలతో పింఛన్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తమ శాఖ బడ్జెట్ రూ.370.45 కోట్ల నుంచి 386.87 కోట్లకు పెరిగిందని పర్యాటక, తెలుగు, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ వివరించారు.