సినిమా హీరో, న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడంపై హీరో నాని నిరసన తెలిపారు. ప్రజలు, ప్రేక్షకులు భరించడానికి సిద్ధంగా ఉన్నపుడు, ప్రభుత్వం టిక్కెట్ల ధరలను ఎందుకు తగ్గించిందో అర్ధం కావడం లేదన్నట్టు నాని వ్యాఖ్యానించారు. పైగా ప్రజలను అగౌరవ పరుస్తున్నట్లు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తమకు ఏ నానీలు తెలియదని, తెలిసిందల్లా మంత్రి కొడాలి నాని అన్న ఒకడే అన్నారు. సినిమాలలో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికే హీరోలు ఇలా స్పందించాలా అని ప్రశ్నించారు.
ఒక సినిమా ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే, సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70 శాతం ఉంటుందని, మరి సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే, సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపు మంట అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.