ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థల ప్రక్షాళనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 'స్పందన' పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, మరికొన్ని వ్యవస్థల పేరు మార్పునకు కూడా చర్యలు చేపట్టనుంది.