ఇలాంటి బేవార్సు సంతకాలు చేయడానికేనా మేం ఐఏఎస్‌లుగా అయ్యాం: చంద్రబాబు ఆటలతో జడిసిపోతున్న అధికారులు
ఆంద్రప్రదేశ్‌లో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు.. చంద్రబాబు ప్రభుత్వ పోకడల పట్ల తీవ్రమైన విముఖతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో నిర్ణయాల్లో తమను ఇన్వాల్వ్ చేయకుండా సీనియర్ ఐఏఎస్‍లు ముందు జాగ్రత్తగా ముఖం చాటేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది
ఆంద్రప్రదేశ్‌లో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు.. చంద్రబాబు ప్రభుత్వ పోకడల పట్ల తీవ్రమైన విముఖతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో నిర్ణయాల్లో తమను ఇన్వాల్వ్ చేయకుండా సీనియర్ ఐఏఎస్‍లు ముందు జాగ్రత్తగా ముఖం చాటేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. స్వార్థ ప్రయోజనాలు లేదా రాజకీయ ప్రయోజనాలకోసం చంద్రబాబు ఎంతకైనా తెగుస్తుండటంతో తమ భవిష్యత్తు గురించిన భయంతో కొంతమంది ఐఏఎస్ అధికారులు వణికిపోతున్నారని సమాచారం.
విశాఖలో ముగిసిన భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాల వైనం ఎంతగా అభాసు పాలు అవుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయల విలువైన భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్లు, పారిశ్రామిక వేత్తల ముసుగులో ఎలాంటి చవకబారు వ్యక్తులున్నారో ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అసలు ఈ ఒప్పందాల తీరునే ఓ కామెడీ ఎపిసోడ్ లాగా మార్చేశాయి.
ఇలాంటి నేపథ్యంలో అసలు హోదాల పరంగా ఈ ఒప్పందాల మీద ప్రభుత్వం తరఫున సంతకాలు చేయాల్సిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మొహం చాటేశారుట. ఇలాంటి బేవార్సు ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి ససేమిరా అనడంతో.. ఆ తర్వాతి స్థాయి మరో ఐఏఎస్ తో సంతకాలు చేయించి ప్రభుత్వం మమ అనిపించింది.
చంద్రబాబునాయుడు పరిపాలనలో అడ్డగోలుగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఐఏఎస్ లు తీవ్రమైన విముఖతతో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం విషయంలోనూ.. చర్చ జరిగినప్పుడు.. ఓ సీనియర్ ఐఏఎస్.. పన్ను మినహాయింపు ద్వారా తగ్గే మొత్తం టిక్కెట్ ధరలో తగ్గించాలంటూ ఉన్న నిబంధనల్ని వివరించారుట. అయితే.. అయిన వారికి ఈ పన్నురాయితీలను దోచిపెట్టదలచుకున్న చంద్రబాబు సర్కారు ఆ మాటలు ఖాతరు లేకుండానే.. కొత్తజీవోను కూడా విడుదల చేసేసింది.
పైగా.. కొందరు సీనియర్ ఐఏఎస్ లు ఏపీ రాష్ట్ర సర్వీసునుంచి తప్పుకుని కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారనే గుసగుసలు కూడా అమరావతిలో వినిపిస్తున్నాయి. కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటున్నారని.. ఏపీ సర్వీసులో ఉంటే.. నాయకుల అవకతవక నిర్ణయాలకు తాము ఇరుక్కుపోతామనే భయంతో వారు కేంద్రసర్వీసుల పట్ల మొగ్గు చూపిస్తున్నారని కూడా తెలుస్తోంది. మరి తన పాలన సమస్తం పారదర్శకం అని సెలవిస్తూ ఉండే చంద్రబాబునాయుడు ఇలాంటి ఐఏఎస్ అధికారులు మొహం చాటేస్తున్న వైనంపై ఏమంటారో?