Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోదా కోసం కలిసి పోరాడతాం అంటారు.. కలవడానికి ఈగో అడ్డొస్తోంది.. కలవడమెలా?

చిత్తశుద్ధితో పోరాడే ఎవరితోనైనా ప్రత్యేకహోదా కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం అని పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి ప్రకటించడంతో తేనెతుట్టెను కదిలించినట్లయింది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనేది తేలకనే హోదా సమస్య అటకెక్కుతోంది. ఎందుకంటే ప్రత్యేకహోదా సాధించ

Advertiesment
హోదా కోసం కలిసి పోరాడతాం అంటారు.. కలవడానికి ఈగో అడ్డొస్తోంది.. కలవడమెలా?
హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (04:34 IST)
చిత్తశుద్ధితో పోరాడే ఎవరితోనైనా ప్రత్యేకహోదా కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం అని పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి ప్రకటించడంతో తేనెతుట్టెను కదిలించినట్లయింది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనేది తేలకనే హోదా సమస్య అటకెక్కుతోంది. ఎందుకంటే ప్రత్యేకహోదా సాధించడం కోసం భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసిపోరాడతాం అని ప్రతిఒక్కరూ చెప్పేవాళ్లే. అంతే తప్ప.. అందరూ కలవడం గురించి క్రియాశీలంగా ప్రయత్నిస్తున్న వారు మాత్రం లేరు. అందుకే పోరాటం బలహీనంగా కనిపిస్తూ.. ఫలితం రాబట్టలేని దౌర్భాగ్యం కనిపిస్తోంది. ఎవరూ పూనిక వహించకుండా.. అందరి మధ్య ఐక్యపోరాటం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఈ మొత్తం వ్యవహారం పిల్లి మెడలో గంట కట్టే చందంగా తయారవుతోంది. 
 
అధికారం గద్దె మీద కూర్చున్న వారు తప్ప, రాజకీయంగా రాష్ట్రంలో అందరూ ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్ చేస్తున్నారు. అందరూ కలసి డిమాండ్ చేస్తే ఖచ్చితంగా కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడిపెరగడం, హోదా సాధించేదిశగా కొంత సానుకూలత ఏర్పడడం జరుగుతుంది. అయితే ఎవరికి వారు తమ రాజకీయ స్వప్రయోజనాలను కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో కలిసి పోరాడడం అనేది కుందేటికొమ్ములాగానే కనిపిస్తోంది. 
 
ప్రత్యేకహోదా సాధించడం కోసం భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసిపోరాడతాం అని ప్రతిఒక్కరూ చెప్పేవాళ్లే. అంతే తప్ప.. అందరూ కలవడం గురించి క్రియాశీలంగా ప్రయత్నిస్తున్న వారు మాత్రం లేరు. అందుకే పోరాటం బలహీనంగా కనిపిస్తూ.. ఫలితం రాబట్టలేని దౌర్భాగ్యం కనిపిస్తోంది. ఎవరూ పూనిక వహించకుండా.. అందరి మధ్య ఐక్యపోరాటం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఈ వ్యవహారం పిల్లి మెడలో గంట కట్టే చందంగా తయారవుతోంది. 
 
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి హోదా విషయంలో తాను చేయగలిగినదెల్లా చేస్తూనే ఉన్నారు. ఆయనైతే ఏకంగా తెలుగుదేశం పార్టీ తోనైనా కలిసి నడవడానికి సిద్ధం అంటున్నారు. నాయకత్వం మాకు అక్కర్లేదు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఓ అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళితే కేంద్రానికి హోదా ఆవశ్యకత  గురించి విన్నవిస్తాం అంటుంటారు. జగన్ ఇలాంటి ఓపెన్ ఆఫర్ ఇస్తున్న మాట నిజమే కానీ.. అది కేవలం తెదేపాకు ముందరి కాళ్లకు బంధం వేయడానికే తప్ప.. ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. చంద్రబాబు ‘ఎస్’ చెప్పలేడు గనుక.. జగన్ పదేపదే అదే అస్త్రం సంధిస్తుంటారు.
 
ఇప్పుడు కొత్తగా హోదా పాట ఎత్తుకున్న పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. చిత్తశుద్ధితో పోరాడే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం అని ఆయన సెలవిస్తున్నారు. తనకంటె ఎంతో ముందునుంచి హోదాను డిమాండ్ చేస్తున్న వైసీపీతో చేయి కలపడానికి పవన్ కల్యాణ్‌కు ఈగో అడ్డు వస్తోంది. దాన్ని కప్పెట్టుకోవడానికి ‘చిత్తశుద్ధి ఉన్న పార్టీలతో కలుస్తా’ వంటి పడికట్టు పదాలు వాడుతున్నారు. 
 
ఆయనేమో తనకు రాజకీయం అక్కర్లేదు.. అధికారం కోసం రాలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ హోదా కోసం ఉద్యమిస్తున్న సందర్భాల్లో దానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అయినా కనీసం ఒక ట్వీట్ కూడా చేయరు. వైసీపీ అంటే ఆయనకు వేర్వేరు కారణాల వల్ల ద్వేషం ఉండొచ్చు గాక.. కానీ పార్టీని వేరుగా వారు పోరాడుతున్న ఉద్యమాన్ని వేరుగా చూడలేకపోతే గనుక.. ఆయన లోని చిత్తశుద్ధిని ఎలా నమ్మగలుగుతాం. 
 
చివరికి ఎలాంటి రాజకీయ ఆసక్తితో నిమిత్తం కూడా లేని తటస్థ సంస్థ గా భావించాల్సిన ప్రత్యేకహోదా సాధన సమితి వారు కూడా పార్టీలో చేసే పోరాటాలతో కలిసిరాకపోవడం అనైక్యతకు పరాకాష్ట. చలసాని శ్రీనివాసరావు తమ సాధన సమితి తరఫున దీక్ష  చేసి.. అందరూ కలిసి రావాలని ప్రకటిస్తారు. జగన్ దీక్ష చేస్తున్నప్పుడు కనీసం పరామర్శకు కూడా వెళ్లరు. అక్కడ మళ్లీ.. తను వెళితే.. జగన్ లాభపడిపోతాడేమో.. అంటూ గిరి గీసుకు కూర్చుంటారు. 
 
ప్రత్యేక హోదా ఉద్యమ కారుల్లో ఇలాంటి చౌకబారు స్వార్థ చింతన ఉండబట్టే.. ప్రత్యేకహోదా కోసం అందరూ కలసి కట్టుగా పోరాడడం అనేది సాధ్యం కావడం లేదు. ఈ భేషజాలు మరచి, రాజకీయాలు మాని, నిజంగానే అందరూ కలిసి పోరాడితే.. ఎంతో కొంత ఫలితం తప్పకుండా ఉంటుందని ఆశించవచ్చు. అంతవరకు అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రత్యేక హోదా వాదులను చూసి నవ్వుకుంటూనే ఉంటాయి. అంతకంటే మించి ముఖ్యమంత్రి చంద్రబాబు మీ అనైక్యతే నాకు శ్రీరామరక్ష అని చిద్విలాసంగా తన పని తాను చేసుకుపోతూనే ఉంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ జగన్ కలిసి పనిచేస్తారట? కానీ పవన్‌ని నమ్మేదెలా? వైకాపా అంతర్మథనం