Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకముందే.. రిమాండ్ రిపోర్టా? హైకోర్టు ఆగ్రహం

bandaru satyanarayana
, బుధవారం, 4 అక్టోబరు 2023 (11:46 IST)
సీఎం జగన్, మంత్రి ఆర్కే రోజాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకముందే పోలీసులు హైకోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండు రిపోర్టును ఏవిధంగా తమకు నేరుగా సమర్పించారన్నది అర్థం చేసుకోలేకపోతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఈ వ్యవహారంపై పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. పోలీసులు చట్టాలను పాటించకపోతే న్యాయస్థానం కళ్లు మూసుకొని ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. బండారు సత్యనారాణ మూర్తి అరెస్టు విషయంలో నిబంధనలను పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. 
 
కోర్టు ముందు ఉంచిన ఆధారాలను పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా నగరంపాలెం ఠాణాలో నమోదు అయిన కేసుకు సంబంధించి సోమవారం రాత్రి 7.45 గంటలకు 41ఏ కింద నోటీసు ఇచ్చినట్లు, మరోవైపు అదేసమయానికి అరెస్టు చేసినట్లు మెమోలో పోలీసులు పేర్కొన్నారు. ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులో 41ఏ కింద నోటీసు ఇస్తూనే సమాంతరంగా అరెస్టు చేసినట్లు తేలినట్లైతే.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
నోటీసుపై సంతకం బండారుదేనని తేలినా దర్యాప్తు అధికారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు మంగళవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పేషీ కోసం రుషికొండపై చకచకా ఏర్పాట్లు