ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్‌కి అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తూ.. కీలకమైన నిర్ణయం తీసుకుంది.
జులై 30వ తేదీ నుంచి 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవొచ్చని చెప్పినా మెజారిటీ థియేటర్లలో జనాలు రాని పరిస్థితి.
అయితే, ఇప్పుడు థియేటర్లను నడుపుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడంతో ఏపీలో థియేటర్లలో సినిమా చూడాలని ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి ఇది గుడ్ న్యూస్‌గానే చెప్పుకోవచ్చు.
థియేటర్లలో సినిమాను విడుదల చేద్దామని వేచిచూస్తున్న సినిమా వాళ్లకు కూడా ఇది గుడ్ న్యూసే. ఇప్పటికే థియేటర్లు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లోనే అందుబాటులోకి వచ్చేశాయి.
ఏపీలో 50 శాతం సీట్ కెపాసిటీ కాబట్టి.. చిన్న సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఆగిపోయిన కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాలు విడుదలవుతాయో అనేది చూడాలి. ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో థియేటర్ల యాజమాన్యాలకు కూడా కాస్త ఉపశమనం కలిగినట్లే అని చెప్పుకోవాలి.
ఆగస్టు రెండవ వారంలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్న క్రమంలో సినిమా థియేటర్లు తెరిచినా.. సినిమాలను విడుదల చేసేందుకు ఏమేరకు నిర్మాతలు ఆసక్తి చూపుతారో చూడాలి. ప్రభుత్వం కూడా థియేటర్లకు కొన్ని షరతులు విధించింది. ప్రతీ షో తర్వాత తప్పకుండా శానిటైజ్ చెయ్యాలంటూ సూచించింది. బౌతిక దూరం విషయంలో కచ్చితమైన ఏర్పాట్లు చెయ్యాలని కోరింది.