కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఇంకా తగ్గని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. సాయంత్రం 6 గంటలకు దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
అలాగే, రెస్టారెంట్లు, జిమ్‌లు, కళ్యాణమండపాలు తెరుచుకోవడానికి జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రజలందరూ తప్పనిసరిగా శానిటైజర్ వాడటంతో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించింది.
అటు థియేటర్ల అనుమతికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.