రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం మరింతగా జఠిలంగా మారేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రానికి పోటీపడి లేఖలు రాస్తున్నాయి. ఇప్పటికే ఏపీ తీరును తప్పుబడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారు. ఇపుడు తెలంగాణ వైఖరికి వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసారు.
నిజానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలకు లోబడే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని తెలంగాణ చెబుతుండగా, నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ ఇప్పటికే ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు.
ఈ రోజు ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు మరో లేఖ రాశారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తొలుత సందర్శించాలని, ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని జగన్ అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని ఆదేశించాలని ఆయన గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. కేఆర్ఎంబీ సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వైఖరితో ఆంధ్రప్రదేశ్ తన వాటా జలాలను కోల్పోతోందని అన్నారు.
అంతేగాక, తెలంగాణ తీరుతో కృష్ణా జలాలు అనవసరంగా సముద్రంలో కలిసి పోతున్నాయని ఆయన తెలిపారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని వివరించారు.
రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టేని, ఈ నెల 9న నిర్వహించబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేయాలని, ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.