ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వమని కోరితో అరెస్టు చేయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో తేడా ఉందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలోని ఆర్ అండ్ బీ భవన సముదాయంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉద్యోగుల హక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షిస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిలకు నిధులు లేకుంటే, దానికి సమానంగా విలువైన స్థలాలు ఇవ్వాలి. దీనిపై వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాం.
తమ సంఘానికి ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు వసతి ఇప్పించాలని సీఎంను కోరగా.. వెంటనే స్పందించి ఆయా జిల్లాల అధికారులకు సూచించారు" అని చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, సంయుక్త కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా, కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.