Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ప్రభుత్వం మారాల్సివుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Advertiesment
komatireddy rajagopal reddy

ఠాగూర్

, ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (17:01 IST)
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌)లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ (ఉత్తర బాగం) రైతులు తొక్కని గడపలేదు. ఢిల్లీలో పెద్దలను కలిసినా వారికి న్యాయం జరగలేదు. దివీస్ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్‌మెంట్ మార్చారు. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ మారాలంటే ఉత్తర భాగం మారాలి. ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్ చేశారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్‌ ఆర్‌ భూనిర్వాసితులతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. అవసరమైతే ట్రిపుల్‌ ఆర్ రద్దయినా సరే భూనిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసానిచ్చారు. 
 
ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంబింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలే తన బలం.. బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా, అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమన్నారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను.. అయినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
 
'నేను లాలూచీపడి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పదవి ఇస్తే చప్పుడు చేయకుండా కూర్చోను. నాకు మా ప్రాంత ప్రజలే ముఖ్యమని సీఎంకు చెబుతా. రాజగోపాల్‌రెడ్డి గట్టి వాడు కోట్లాడటానికి వెనుకాడరనే మీ నమ్మకాన్ని వమ్ము చేయను. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుంది.. అది విడదీయలేనిది. భూమి అంటే వ్యవసాయం ఒక్కటే కాదు అది ఒక స్టేటస్. ట్రిపుల్‌ ఆర్‌లో మునుగోడు నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూమిని కోల్పోతున్నారు. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అవసరమైతే కేంద్ర మంత్రులను కలుస్తా. మీకు న్యాయం జరిగేంత వరకు శాసనసభ్యుడిగా మీతో పాటు కలిసి పోరాడుతా' అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రమశిక్షణ పేరుతో రెండో తరగతి విద్యార్థినితో.. 100 గుంజీలు తీయించిన టీచర్‌