ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం పగటిపూటే చుక్కలు చూపుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులతో పాటు అధికార యంత్రాంగాన్ని ప్రయోగించింది.
అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే, ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వొద్దంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ముందుగా ముంజూరు చేసిన సెలవులను కూడా రద్దు చేశారు. పైగా, ప్రతి ఒక్కరూ హాజరు పట్టికలో విధిగా సంతకాలు చేసి, వాటిని స్కానింగ్ చేసి పంపాలంటూ ఆదేశించారు. ఈ ఆదేశాలతో పాటు అధికారుల వ్యవహారశైలిపై అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, ఛలో విజయవాడలో ఎవరూ పాల్గొనవద్దని కూడా పేర్కొంది. సెక్షన్ 144 కింద విజయవాడలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, వాటిని ఉల్లంఘించి ఛలో విజయవాజడలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏవేని సమస్యలు ఉన్నట్టయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రాలు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని సూచించింది.