విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంకు విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానం పలికారు. మంగళవారం విజయవాడ రాజ్ భవన్ కు వచ్చిన సరస్వతీ స్వామి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు వరకు నిర్వహించే పీఠం వార్షిక మహోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసారు.
శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠంగా విలసిల్లుతుందని, సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం చేపడుతుందని ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి గవర్నర్ కు వివరించారు. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా ప్రబోధం చేసే గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోందని తెలిపారు. వార్షిక మహోత్సవ వేడుకకు సకుటుంబ సమేతంగా విచ్చేసి, శుభాభినందనలు అందించాలని కోరారు.