'ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి మళ్లించడానికి. ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయం గుర్తు పెట్టుకోండి. ప్రతి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉంటుంది' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాజాగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ఆరా తీశారు.
ఆయా నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో.. పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పవన్ సూచించారు. 'అందుబాటులో అంటే.. అర్థం కాని వివరాలు, ఇంగ్లీష్‌లో ఉండడం కాదు. పదో తరగతి చదువుకున్న వారికి కూడా.. మనం ఏం చేస్తున్నామో.. చదవగానే అర్ధం కావాలి. ప్రతి రూపాయికీ లెక్క చూపించాలి. ప్రతి గ్రామంలోనూ చేపట్టిన పనులు.. ఎవరు చేస్తున్నారు. ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నాం అనే వివరాలు స్పష్టంగా ఉండాలి' అని పవన్ ఆదేశించారు.
గతంలో వైసీపీ హయాంలో కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను దారి మళ్లించారన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూటమి సర్కారుపై గ్రామీణులు చాలానే ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. వారి ఆశలు వమ్ముకావడానికి వీల్లేదని.. ప్రతి రూపాయినీ వారికి చెప్పాలని అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ప్రతిరూపాయీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బదలాయించాలన్నారు. అదేవిధంగా అధికారులు జవాబు దారీ తనంతో వ్యవహరించాలని సూచించారు.
ఇక, పల్లె - పండుగ, పంచాయతీ వారోత్సవాల్లో అనుమతించిన రహదారుల నిర్మాణం, మంచినీటి పైపు లైన్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ పనులు అత్యంత నాణ్యంగా ఉండాలని.. సొంత ఇంటికి ఎలా అయితే.. శ్రద్ధతో పనులు చేయించుకుంటారో.. అలానే ఈ పనులు కూడా ఉండాలని అధికారులకు హితవు పలికారు. ముఖ్యంగా ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పదే పదే చెప్పడం గమనార్హం.