ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు.
దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్నా భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయి. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చించిన పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం.
ఏపీలో గత సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేయడం జరిగింది. అంతేకాకుండా 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను/ ముఠాలను అరెస్టు చేయడం జరిగింది.
గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్టు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకుగాను,15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాము, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తాం.
కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం, ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నాం. మన రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తులో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు సిట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంవో అఫెండర్స్‌ను ఇప్పటికే గుర్తించాం. వారందరినీ కూడా జియో మ్యాపింగ్‌తో అనుసంధానం చేశాం. వీరిపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్‌ను ఓపెన్ చేస్తాం. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో దేవాలయాలకు/పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు.
దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి ఇది మనందరి బాధ్యత మీ అందరి సహకారంతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకుందాం.. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, దేవాలయాలకు సంభందించి ప్రత్యేకంగా 9392903400 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.