ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కితాబు ఇచ్చారు. అనవసరంగా ఆయనపై బురద చల్లుతున్నారని అన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. ఇటీవల విజయవాడ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్‌లిక్కర్‌పై చేసిన వ్యాఖ్యలను నారాయణస్వామి తప్పుబట్టారు. మద్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? అని నిలదీశారు.
బీజేపీ జాతీయ నేతలు విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో ఇష్టం వచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలారని మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను జైలుకు పంపిస్తామంటూ భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సింహమని, ఎవరికీ భయపడరన్నారు. ఆయన్ను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.