ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్ చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు సరికాదని, తమకు ఎదురు చెప్పేవారు ఉండకూడదని ముఖ్యమంత్రి దాడులకు సైతం వెనుకాడటం లేదని పద్మశ్రీ ఆరోపించారు. రాజకీయ పార్టీలు అన్న తరువాత ఎవరి పార్టీ సిద్దాంతాలు వారికి ఉంటాయని, ముఖ్యమంత్రి జగన్ పార్టీ సిద్దాంతం రౌడీయిజం అని ఆమె ఎద్దేవా చేశారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడి అంటే, ఉద్దేశపూర్వకంగా చేసింది కాక మరేంటని ఆమె ప్రశ్నించారు.
ఏపీ పోలీస్ శాఖ వైసీపీ పోలీస్ శాఖగా మారిందని, అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు. జరిగిన తప్పును తప్పు అని చెబుతున్న తనపై కూడా రేపు వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఆశ్చర్యం లేదని సుంకర పద్మశ్రీ అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇంటిపై దాడికి దిగిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలన్నారు.