ఈ నెల 27వ తేదీ నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం సోమవారం అంకురార్పణ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తిరుమలకు వెళుతున్నారు.
ఈ మేరకు సీఎంఓ ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు నంద్యాల జిల్లా పర్యటనకు వెళతారు.
సీఎం జగన్ తిరుమల పర్యటనలో భాగంగా తొలుత అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుని రాత్రి 8.20 గంటలకు స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వెంకన్న దర్శనం తర్వాత సీఎం రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు.
మరుసటిరోజు ఉదయం స్వామి వారిని మరోమారు దర్శనం చేసుకుని ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరుమల కొండపైనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన నూత పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ వీపీఆర్ ట్రస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఆపై రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నంద్యాల జిల్లా పర్యటనకు వెళతారు.