తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో పనితీరు ఏమాత్రం బాగోలేని నేతలకు ఆయన హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా, ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదని, అందువల్ల వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వంతో పాటు సామాజికన్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపట్టింది. వీటికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి అలెర్ట్ అయ్యారు. ఈ రెండు కార్యక్రమాలపై ఆయన ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆయన తాను తెప్పించుకున్న నివేదికను బయటకు తీశారు. ఈ నివేదికలో పలువురి పనితీరు బాగానే ఉన్నా... ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందని చెప్పారు. ఈ ఏడుగురు ఇళ్లు కదలకుండానే... తమ అనుచరులను పంపుతూ కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారని సీఎం బహిర్గతం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించిన జగన్... ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.