గత పదేళ్ళ కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. 2009 తర్వాత అంతటి పెద్ద ఎత్తున జలాశయాలకు నీటి నిల్వలు చేరుకోవడం ఇదే మెుదటిసారి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకమంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే 2009లో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జలాశయాలు నిండుకున్నాయి. తాజాగా జగన్ పాలనలో జలాశయాలు నిండుకుండను తలపిస్తుండటం విశేషం.