ఏపీ అసెంబ్లీలో 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఈ పెన్షన్ పథకంపై అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించగా మొదట మంత్రి పెద్దిరెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా, మోసం చేయడం అబద్ధాలు ఆడటం మా ఇంట వంటా లేదని మరోసారి చెబుతున్నాని జగన్ చెప్పుకొచ్చారు.
'ఎన్నికలకు వెళ్లే ముందు ఈ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగాం. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాతే ప్రజలు మాకు ఓట్లేశారు. ఎన్నికలప్పుడు జగన్ అనే నేను.. ఏం మాట్లాడానో టీవీ స్క్రీన్‌లలో చూపిస్తాను. చూసిన తర్వాత మీకు మనస్సాక్షి ఉంటే క్షమాపణ చెప్పమని కోరుతున్నాను' అని జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, అసెంబ్లీలోనే ఎన్నికల సమయంలో మాట్లాడిన స్పీచ్‌ను సభలో ప్రసారం చేసి వినిపించారు.
వీడియోలో ఏముంది..!?
'నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క, చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. అక్కాచెల్లెమ్మ సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మేవారిలో మొట్టమొదటి వ్యక్తిని నేను అని గర్వంగా చెబుతున్నాను. వైఎస్సార్ చేయూత అనే కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని కొందరు వెటకారం చేశారు' అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.