ఆంధ్రప్రదేశ్ లో ముంపు పాలైన వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది.
ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీగా నష్టం సంభవించింది. వరద సహాయక చర్చలపై ఎప్పటికపుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ఈ రోజు నేరుగా, ఆ జిల్లాలను పరిశీలిస్తారు. భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.
సీఎం ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో జరిగిన నష్టాన్ని, ముంపు అయిన ప్రాంతాలను సీఎం ప్రత్యేక హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్ జగన్, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.